కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్‌

సాక్షి, న్యూఢిల్లీ :   కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)   భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది.  అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా  మార్చి 31 వరకు మూసివేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  ఒక ప్రకటన జారీ చేశారు.  ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో  భాగంగా తాజా ఆదేశాలిచ్చింది.  మరోవైపు దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కాగా  కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.